ఇమ్యునోథెరపీ గురించి మీరు తెలుసుకోవలసినది ఏమిటి?

by Team Onco
979 views

అనేక రకాల క్యాన్సర్ల చికిత్సలో ఇమ్యునోథెరపీ విప్లవాత్మక మార్పులు చేసింది. 1990లలో జేమ్స్ పి.అల్లిసన్ (James P.Allison) మరియు టసుకి హోంజో (Tasuki Honjo) అనే పరిశోధకుల మార్గదర్శక పరిశోధన రోగనిరోధక వ్యవస్థను చురుకుగా పని చేసేలా చేయడం ద్వారా క్యాన్సర్‌తో పోరాడటానికి మార్గాలు ఉన్నాయని నిర్ధారించింది. ఈ పరిశోధనలు చివరికి కొత్త క్యాన్సర్ చికిత్సలను అభివృద్ధి చేయడంలో ప్రధాన పురోగతికి దారితీసాయి.

ఈ విజయానికి గుర్తింపుగా వారికి 2018లో వైద్య రంగంలో నోబెల్ బహుమతి (Nobel prize) లభించింది. క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగుల యొక్క చికిత్సా ఫలితాలను మెరుగు పరిచినందుకు ఇమ్యునోథెరపీని ప్రపంచవ్యాప్తంగా శాస్త్రీయ సంఘం ప్రశంసించింది.

ఇమ్యునోథెరపీ (Immunotherapy) గురించి ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం:

ఇమ్యునోథెరపీ ఎలా పని చేస్తుంది?

ఇమ్యునోథెరపీ మీ రోగనిరోధక వ్యవస్థ (Immune system) యొక్క సహజమైన రోగనిరోధక శక్తిని (Immune power)పెంచడం లేదా  ప్రేరేపించడం ద్వారా పనిచేస్తుంది. ఈ ఇమ్యునోథెరపీ చికిత్సలో మన శరీర రోగనిరోధక వ్యవస్థ క్యాన్సర్ కణాలను కనుగొని వాటిని నాశనం చేస్తుంది.

క్యాన్సర్ కణాలు మీ శరీరం యొక్క సహజ రక్షణ యంత్రాంగం (defense mechanism) నుండి పరిణామం చెందడానికి మరియు తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాయి. అనేక క్యాన్సర్లు మన శరీరంలోని T-కణాలను (T-Cells) ఒక సంక్లిష్ట ప్రక్రియ ద్వారా “క్రియారహితం” చేస్తాయి. చివరికి ఈ T-కణాలు పని చేయకపోవడం వల్ల క్యాన్సర్ కణాలు మన రోగనిరోధక వ్యవస్థ నుండి తప్పించుకుని అసాధారణంగా పెరుగుతాయి.

Immunotherapy drugs block tumour cells from deactivating T-cells

T-కణాలు; క్యాన్సర్ కణాలపై దాడి చేసే మీ శరీరం యొక్క రోగనిరోధక వ్యవస్థలో ముఖ్యమైన భాగం.

ఈ పరిస్థితిలో, ఇమ్యునోథెరపీ పనిచేస్తుంది. ఇది ఈ ప్రతికూల సంకేతాలను (negative signals) అడ్డుకుంటుంది మరియు క్యాన్సర్ కణాలను నాశనం చేయడానికి మన రోగనిరోధక వ్యవస్థను తిరిగి చురుకుగా పని చేసేలా చేస్తుంది.

అన్ని క్యాన్సర్లకు ఇమ్యునోథెరపీ పనిచేస్తుందా?

ఇమ్యునోథెరపీ అన్ని క్యాన్సర్లకు పని చేయదు. కానీ కొన్ని రకాల క్యాన్సర్లకు ఇది బాగా పనిచేస్తుంది. అవి ఏంటంటే;

  • ఊపిరితిత్తుల క్యాన్సర్లు
  • మూత్రపిండాల క్యాన్సర్లు
  • మెలనోమా (ఒక రకమైన చర్మ క్యాన్సర్)
  • కొన్ని రకాల బ్లడ్ క్యాన్సర్లు (ఉదా: హాడ్జికిన్స్ లింఫోమా)

ఇమ్యునోథెరపీ అనేది వ్యాప్తి చెందిన మరియు వేరే చికిత్సలతో నయం కాని నోటి క్యాన్సర్లు, కడుపు క్యాన్సర్లు మొదలైనవాటితో బాధపడుతున్న కొంతమంది రోగులకు కూడా ప్రయోజనం చేకూర్చింది.

ఇమ్యునోథెరపీ ఇతర రకాల క్యాన్సర్‌లకు చికిత్స చేయడానికి సహాయపడుతుందో లేదో తెలుసుకోవడానికి చాలా పరిశోధనలు జరుగుతున్నాయి. కానీ ప్రస్తుతానికి, చాలా మంది రోగులకు ప్రామాణిక చికిత్స (Standard treatment) అనేది ఆంకాలజీ యొక్క 3 ప్రాథమిక చికిత్సలు: శస్త్రచికిత్స (Surgery), కీమోథెరపీ(Chemotherapy) మరియు రేడియేషన్ థెరపీ (Radiation therapy).

ఇమ్యునోథెరపీ వల్ల ఏవైనా దుష్ప్రభావాలు ఉన్నాయా?

జుట్టు రాలడం, వికారం, వాంతులు, శరీరంలో రక్తం తగ్గడం, విరేచనాలు మొదలైన దుష్ప్రభావాలకు కారణమయ్యే కీమోథెరపీలా కాకుండా, ఇమ్యునోథెరపీ మందులు భిన్నమైన దుష్ప్రభావాలకు దారితీస్తాయి.

చాలా మంది రోగులకు ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు!

కొంతమంది రోగులు అలసట, చర్మంపై దద్దుర్లు, థైరాయిడ్ హార్మోన్ల హెచ్చుతగ్గులు మొదలైన దుష్ప్రభావాలను (Side effects) అనుభవిస్తారు మరియు ఇవి సులభంగా నియంత్రించబడతాయి.

అయినప్పటికీ, కొంతమంది రోగులలో (3 – 5%), రోగనిరోధక వ్యవస్థ అవసరానికి మించి పని చేస్తుంది మరియు ఊపిరితిత్తులు, కాలేయం, ప్రేగులు మొదలైన అవయవాలపై (Organs) దాడి చేస్తుంది. అటువంటి సందర్భాలలో, మేము తాత్కాలికంగా చికిత్సను నిలిపివేస్తాము మరియు రోగనిరోధక వ్యవస్థను అణిచివేసేందుకు మరియు అవయవాలకు మరింత నష్టం జరగకుండా నిరోధించడానికి రోగికి స్టెరాయిడ్ (Steroids) మందులు అందిస్తాము. 

ఇమ్యునోథెరపీకి ఎంత ఖర్చవుతుంది?

ప్రస్తుతం భారతదేశంలో అత్యంత సాధారణంగా ఉపయోగించే ఇమ్యునోథెరపీ మందులు, నివోలుమాబ్(Nivolumab) మరియు పెంబ్రోలిజుమాబ్(Pembrolizumab) చాలా ఖరీదైనవి. పెంబ్రోలిజుమాబ్ (Keytruda,100mg) యొక్క ఒక సీసా ధర సుమారు INR 1.97 లక్షలు. ఈ మందులు వాటి చికిత్సా ప్రయోజనాలను సాధించడానికి సుదీర్ఘకాలం పాటు ప్రతి 3 వారాలకు ఒకసారి సిరలోకి (Intravenously) ఇవ్వబడుతాయి.

అయినా, ఆశ కోల్పోవద్దు. ఈ మందుల ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. అందులో ఒకటి ‘తక్కువ-మోతాదు ఇమ్యునోథెరపీ’ని (Low-dose Immunotherapy) ఉపయోగించడం, దీనిలో ఈ మందులు US FDA- ఆమోదించబడిన మోతాదుల కంటే చాలా తక్కువ మోతాదులో ఉపయోగించబడతాయి.

దీని వెనుక కారణం ఏమిటంటే, కీమోథెరపీ ఔషధాల వలె కాకుండా, ఈ ఇమ్యునోథెరపీ మందులు తక్కువ మోతాదులో ఇచ్చినప్పుడు కూడా ప్రభావవంతంగా పని చేస్తాయని అధ్యయనాల నుండి కొన్ని ఆధారాలు ఉన్నాయి. ఈ చికిత్సా విధానం ప్రాణాలను రక్షించే ఔషధాలను వీలైనంత ఎక్కువ మంది క్యాన్సర్ రోగులకు చేరేలా చేస్తుంది. భారతదేశంలో క్యాన్సర్ రోగులలో తక్కువ-మోతాదు ఇమ్యునోథెరపీని పరీక్షిస్తున్న క్లినికల్ ట్రయల్స్ కొనసాగుతున్నాయి.

ఈ చికిత్స ఎవరి నుండి తీసుకోవాలి?

కీమోథెరపీ మరియు ఇమ్యునోథెరపీ వంటి చికిత్సలు ఎల్లప్పుడూ శిక్షణ పొందిన మెడికల్ ఆంకాలజిస్ట్ పర్యవేక్షణ (Medical Oncologist Supervision) మరియు మార్గదర్శకత్వంలో తీసుకోవడం చాలా ముఖ్యం. మెడికల్ ఆంకాలజిస్ట్ రోగికి మరియు వారి కుటుంబ సభ్యులకు చికిత్స యొక్క ప్రయోజనాలు, దుష్ప్రభావాలు మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తలను స్పష్టంగా వివరిస్తారు. చికిత్స సమయంలో ఏమైనా దుష్ప్రభావాలు సంభవించిన సందర్భంలో తక్షణ సంరక్షణ కొరకు కూడా అందుబాటులో ఉంటారు. ఈ విధంగా, రోగులు క్యాన్సర్ నయం కావడానికి మరియు వారి జీవితాన్ని పొడిగించడానికి ఉత్తమ అవకాశాలను ఆశించవచ్చు. 

 

Related Posts

Leave a Comment