గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ వ్యాక్సిన్ (HPV) ఎందుకు చాలా ముఖ్యమైనది? దీని ధర ఎంత?

by Team Onco
899 views

భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలలో క్యాన్సర్ సంబంధిత మరణాలకు ప్రధాన కారణాలలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ఒకటి. ప్రపంచవ్యాప్తంగా మహిళల్లో ఇది మూడవ అత్యంత సాధారణ క్యాన్సర్. భారతదేశంలో ప్రతి ఎనిమిది నిమిషాలకు ఒక మహిళ గర్భాశయ క్యాన్సర్‌తో మరణిస్తున్నట్లు అంచనా.

రెగ్యులర్ స్క్రీనింగ్ మరియు టీకా కార్యక్రమాలు అమలు చేయని ప్రాంతాల్లో గర్భాశయ క్యాన్సర్ సాధారణంగా కనిపిస్తుంది.

Importance of cervical cancer vaccine

గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ (Cervical Cancer) వ్యాక్సిన్ – ఇది ఎవరికి అవసరం?

HPV వ్యాక్సిన్ 9 నుండి 26 సంవత్సరాల వయస్సు వారికి సిఫార్సు చేస్తారు. 

  • 9 నుండి 14 సంవత్సరాల వయస్సు వారికి, HPV వ్యాక్సిన్ 6 నుండి 12 నెలల వ్యవధిలో 2 సార్లు ఇవ్వబడుతుంది. 
  • 15 నుండి 26 సంవత్సరాల వయస్సు వారికి, HPV వ్యాక్సిన్ 6 నెలల వ్యవధిలో 3 సార్లు ఇవ్వబడుతుంది. రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా ఉన్న వ్యక్తులు కూడా HPV టీకాను 3 సార్లు పొందవచ్చు. ఈ వ్యాక్సిన్ మొదటి లైంగిక చర్యకు ముందు తీసుకుంటే మహిళలకు అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుంది. 

HPV వ్యాక్సిన్ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, వల్వార్(vulvar) క్యాన్సర్, యోని క్యాన్సర్, పురుషాంగ క్యాన్సర్, మల ద్వార(anal) క్యాన్సర్, జననేంద్రియ మొటిమలు, ఒరోఫారింజియల్ క్యాన్సర్‌లు, HPV వల్ల కలిగే తల మరియు మెడ క్యాన్సర్‌లు మరియు భాగస్వాములకు HPV ఇన్ఫెక్షన్ వ్యాప్తిని నిరోధిస్తుంది.

గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌కు ప్రమాద కారకాలు ఏమిటి?

గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అవకాశాలను పెంచే ప్రమాద కారకాలు క్రింది విధంగా ఉన్నాయి:

  1. నిరంతర HPV ఇన్ఫెక్షన్: 99% గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ కేసులలో HPV ఇన్ఫెక్షన్ కనుగొనబడింది. గర్భాశయ క్యాన్సర్ సాధారణంగా 10 నుండి 20 సంవత్సరాల నిరంతర HPV ఇన్ఫెక్షన్ తర్వాత అభివృద్ధి చెందుతుంది
  2. HPV ఇన్ఫెక్షన్ తో ముడిపడి ఉన్న ప్రమాద కారకాలు:
  • చిన్న వయసులోనే లైంగిక చర్యలో పాల్గొనడం (21 సంవత్సరాల కంటే తక్కువ)
  • బహుళ లైంగిక భాగస్వాములు కలిగి ఉండటం 
  • బహుళ లైంగిక సంబంధాలు కలిగి ఉన్న పురుష లైంగిక భాగస్వామిని కలిగి ఉండటం
  • అనేక సార్లు గర్భం పొందడం
  • క్లామిడియా (Chlamydia) మరియు HIV ఇన్ఫెక్షన్ వంటి లైంగికంగా సంక్రమించే వ్యాధులు (Sexually Transmitted Diseases) కలిగి ఉండటం  

3. కెమికల్స్, హార్మోన్లు మరియు ఇతర క్యాన్సర్ కారకాలు కూడా గర్భాశయ క్యాన్సర్‌కు ప్రమాద కారకాలుగా గుర్తించబడ్డాయి.

4. ధూమపానం గర్భాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది.

5. రోగులలో HPV ఇన్ఫెక్షన్ మరియు మునుపటి HIV ఇన్ఫెక్షన్ కారణంగా గర్భాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఐదు రెట్లు ఎక్కువగా ఉంటుంది.

HPV వ్యాక్సిన్ పొందడానికి సరైన సమయం ఏది?

HPV వ్యాక్సిన్ లైంగిక చర్యలకు ముందు లేదా HPVతో ప్రభావితమవ్వక ముందు తీసుకుంటే ఉత్తమంగా పనిచేస్తుంది. మీకు ఇప్పటికే HPV సోకినట్లయితే, ఈ టీకా దానిని నయం చేయడానికి మీకు ఉపయోగపడదు  కానీ ఇతర HPV జాతుల ఇన్ఫెక్షన్లను నిరోధించడంలో సహాయపడుతుంది.

HPV వ్యాక్సిన్ పొందడానికి ఉత్తమ వయస్సు 11 లేదా 12 సంవత్సరాలు, అయితే టీకాలు వేయడం 9 సంవత్సరాల నుండి ప్రారంభమవుతుంది మరియు 26 సంవత్సరాల వరకు తీసుకోవచ్చు. ఇది 26 సంవత్సరాల తర్వాత సూచించబడదు. కొన్ని సందర్భాల్లో మాత్రమే, ప్రజలు 40 సంవత్సరాల వరకు వైద్యుల అనుమతితో తీసుకోవచ్చు.

HPV వ్యాక్సిన్ (గార్డసిల్ 9); 9 నుండి 26 సంవత్సరాల వయస్సు గల అబ్బాయిలకు మరియు బాలికలకు ఇవ్వవచ్చని నిరూపించబడింది. అబ్బాయిలకు టీకాలు వేయడం వల్ల వైరస్ వ్యాప్తి నుండి బాలికలను రక్షించడంలో సహాయపడుతుంది. HPV వ్యాక్సిన్ (గార్డసిల్ 9) USAలో అబ్బాయిలు మరియు పురుషులకు సిఫార్సు చేయబడింది, అయితే ఇది భారతదేశంలో ఇంకా సిఫారసు చేయబడలేదు.

మీరు HPV వ్యాక్సిన్‌ని పొందాలనుకుంటే గైనకాలజిస్ట్(Gynecologist)ని సంప్రదించమని మేము మీకు సూచిస్తున్నాము.

HPV వ్యాక్సిన్‌ను ఎవరు తీసుకోకూడదు?

HPV టీకా ఈ క్రింది వాటి కోసం సిఫార్సు చేయబడలేదు;

  • గర్భిణీ స్త్రీలు
  • తీవ్రంగా లేదా మధ్యస్థంగా అనారోగ్యంతో ఉన్న వ్యక్తులు
  • ఈస్ట్(Yeast) లేదా లాటెక్స్(Latex) లేదా టీకాలోని ఏదైనా పదార్థాలకు అలెర్జీ
  • HPV టీకా యొక్క మొదటి మోతాదు తీసుకున్న తర్వాత తీవ్రమైన అలెర్జీ ప్రతిచర్యలను అనుభవిస్తే, మిగిలిన మోతాదులు ఇవ్వబడవు

HPV టీకాలు సురక్షితమేనా?

HPV టీకాలు క్లినికల్ ట్రయల్స్‌లో మరియు వాస్తవ-ప్రపంచ వినియోగంలో సురక్షితమైనవి మరియు ప్రభావవంతమైనవిగా నిరూపించబడ్డాయి. గార్డసిల్ 2006లో ఆమోదించబడింది మరియు గార్డసిల్ 9, 2014లో USFDAచే మగ మరియు ఆడ ఇద్దరిలో ఉపయోగకరమైనదని ఆమోదించబడింది. అయినప్పటికీ, టీకా తీసుకున్న తర్వాత జ్వరం, ఇంజెక్షన్ చేసిన ప్రదేశంలో దురద, చేయి నొప్పి, తలనొప్పి, తల తిరగడం, వికారం మొదలైన కొన్ని దుష్ప్రభావాలు ఎదుర్కొనబడినవి.

సర్వైకల్ క్యాన్సర్ యొక్క అత్యంత సాధారణ సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

కింది లక్షణాలలో ఏవైనా నిరంతరంగా ఉంటే గర్భాశయ క్యాన్సర్ కోసం పరీక్షించుకోవాలి: 

  1. అసాధారణమైన యోని రక్తస్రావం.
  2. పోస్ట్ కోయిటల్ బ్లీడింగ్ (Postcoital bleeding; లైంగిక చర్య తర్వాత రక్తస్రావం).
  3. గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్ తరచుగా నిర్వహించబడే దేశాల్లో, అసాధారణమైన పాప్ స్మియర్ (Pap Smear) అనేది గర్భాశయ క్యాన్సర్‌ను గుర్తించే అత్యంత సాధారణ లక్షణం.
  4. గర్భాశయ క్యాన్సర్ యొక్క ఇతర లక్షణాలు దుర్వాసన మరియు రక్తం కలిగివున్న యోని స్రావాలు మరియు సుప్రప్యుబిక్ (Suprapubic) ప్రాంతంలో నొప్పి.
  5. మూత్రాశయం(Bladder) మరియు పురీషనాళాన్ని(Rectum) ప్రభావితం చేసే గర్భాశయ క్యాన్సర్ ఉన్న రోగులలో; తరచుగా మూత్రవిసర్జన, మూత్రాన్ని నియంత్రించలేకపోవడం, అత్యవసర మూత్ర విసర్జన భావన, మూత్రంలో రక్తం, మలబద్ధకం మరియు మల రక్తస్రావం వంటి మార్పులు గుర్తించబడ్డాయి.
  6. రోగులు సులభంగా అలిసిపోవడం, వివరించలేని బరువు తగ్గడం, మరియు ఆకలి లేకపోవడం గురించి కూడా ఫిర్యాదు చేశారు.
  7. గర్భాశయ క్యాన్సర్‌ ఇతర అవయవాలకు వ్యాపించిన రోగులకు కడుపు నొప్పి, కొద్దిగా తిన్న తర్వాత కడుపు నిండుగా అనిపించడం, వికారం మరియు వాంతులు, ఎముకలు నొప్పి, దగ్గు మరియు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అని కూడా ఫిర్యాదు చేశారు.

భారతదేశంలో గర్భాశయ క్యాన్సర్ వ్యాక్సిన్ ఎలా పొందాలి? 

ప్రపంచవ్యాప్తంగా లైసెన్స్ పొందిన రెండు గర్భాశయ క్యాన్సర్ టీకాలు (HPV Vaccines) ప్రస్తుతం భారతదేశంలోని ఈ రెండు కంపెనీల ద్వారా అందుబాటులో ఉన్నాయి;

  1. గార్డసిల్ (GardasilTM ) –  MSD ఫార్మాస్యూటికల్స్ ద్వారా విక్రయించబడుతుంది  
  2. సర్వారిక్స్ (CervarixTM) – గ్లాక్సో స్మిత్ క్లైన్ (GSK) ఫార్మాస్యూటికల్స్ ద్వారా విక్రయించబడుతుంది. 

ఈ వ్యాక్సిన్‌ను ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో ఎక్కువగా వేస్తారు. ప్రజలు కోరినప్పుడు లేదా డాక్టర్ సూచించినప్పుడు మాత్రమే ఇది ఇవ్వబడుతుంది.

సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ (HPV Vaccine) ఎంత ఖర్చు అవుతుంది? 

0.5ml గార్డసిల్ (Gardasil) వ్యాక్సిన్ ఒక్క డోస్ కు దాదాపు Rs. 10,000 ఖర్చవుతుంది 

0.5ml సర్వారిక్స్ (Cervarix) వ్యాక్సిన్ ఒక్క డోస్ కు దాదాపు Rs. 4500 ఖర్చవుతుంది 

Related Posts

Leave a Comment