అన్నవాహిక క్యాన్సర్: లక్షణాలు, రోగ నిర్ధారణ మరియు చికిత్స

by Team Onco
1167 views

“అన్నవాహిక (esophagus) అనేది జీర్ణవ్యవస్థలో ఒక భాగం, ఇది గొంతు నుండి మొదలై కడుపు వరకు ఉంటుంది. ఇది పొడవాటి గొట్టంలా ఉంటుంది. ఇది శ్వాసనాళం (trachea) వెనుక, మరియు వెన్నెముక ముందు, మెడ మరియు ఛాతీకి సమీపంలో ఉంటుంది.”

గొంతు నుండి ఆహారం మింగిన తరువాత అన్నవాహిక ద్వారా కడుపులోకి చేరుతుంది. ఆ తరువాత ఆహారం కడుపులో జీర్ణమవుతుంది.

గత కొన్ని దశాబ్దాలుగా, అన్నవాహిక క్యాన్సర్ (esophageal cancer) చాలా మందిలో కనిపిస్తుంది మరియు క్యాన్సర్ వల్ల మరణాలు పెరగడానికి ఒక కారణమయ్యింది. అందువల్ల, అన్నవాహిక క్యాన్సర్ అంటే ఏమిటి, దాని సంకేతాలు (signs) మరియు లక్షణాలు (symptoms) ఎలా ఉంటాయి, దానిని ఎలా నిర్ధారించవచ్చు, మరియు దాని చికిత్సా పద్ధతుల గురించి మరింత తెలుసుకోవడం చాలా ముఖ్యం.

Esophageal Cancer Occurs at any part of the esophagus

అన్నవాహిక క్యాన్సర్ అంటే ఏమిటి?

అన్నవాహిక క్యాన్సర్ అనేది అన్నవాహికలో ఎక్కడైనా సంభవించే ఒక రకమైన క్యాన్సర్. కణాలు అనియంత్రిత (uncontrollable) పద్ధతిలో విభజించడం మరియు అసాధారణంగా పెరగడం ప్రారంభించినప్పుడు క్యాన్సర్ వస్తుంది.

ఈ కణాలు చుట్టుపక్కల కణజాలాలలోకి పెరిగి శరీరంలోని ఇతర అవయవాలకు లేదా ఇతర ప్రాంతాలకు వ్యాపించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.

అన్నవాహిక క్యాన్సర్ సాధారణంగా అన్నవాహిక లోపలి పొరలో మొదలై బయటి పొరల్లోకి వ్యాపిస్తుంది.

అన్నవాహిక క్యాన్సర్ యొక్క వివిధ రకాలు ఏమిటి?

అన్నవాహిక అనేక రకాలైన కణాలను (cells) కలిగి ఉండే కణజాలాల (tissues) యొక్క అనేక పొరలతో రూపొందించబడింది. క్యాన్సర్ బారిన పడిన కణాల రకాన్ని బట్టి, అన్నవాహిక క్యాన్సర్ ప్రధానంగా రెండు రకాలు:

స్క్వామస్ సెల్ కార్సినోమా (SCC)

మ్యూకోస (Mucosa) అని పిలువబడే అన్నవాహిక యొక్క లోపలి పొర స్క్వామస్ కణాలతో (squamous cells) తయారయ్యుంటుంది. ఈ కణాలు పలుచగా మరియు చదునుగా ఉంటాయి. ఇటువంటి కణాలలో మొదలయ్యే క్యాన్సర్‌ను స్క్వామస్ సెల్ కార్సినోమా (Squamous Cell Carcinoma) అంటారు.

ఇది సాధారణంగా అన్నవాహిక యొక్క ఎగువ మరియు మధ్య 1/3 వంతులో సంభవిస్తుంది. ఈ రకమైన క్యాన్సర్‌ ప్రపంచవ్యాప్తంగా 90% అన్నవాహిక క్యాన్సర్‌ కేసులకు కారణమయ్యింది.

అడెనోకార్సినోమా (AC)

అన్నవాహిక శ్లేష్మాన్ని (Mucus) ఉత్పత్తి చేయడానికి సహాయపడే కణాలను కలిగి ఉంటుంది. ఈ కణాలను గ్లాండులార్ కణాలు (Glandular cells) అని కూడా పిలుస్తారు.  ఇవి వాటి యొక్క శ్లేష్మంతో అన్నవాహిక లోపలి పొరను కప్పివేస్తాయి. ఈ రకమైన కణాలలో అభివృద్ధి చెందే క్యాన్సర్‌ను అడెనోకార్సినోమా (Adenocarcinoma) అంటారు.

ఇది ఎక్కువగా అన్నవాహిక యొక్క దిగువ భాగంలో మొదలవుతుంది. యాసిడ్ రిఫ్లక్స్ (Acid Reflux) వ్యాధి కారణంగా ఏర్పడిన “బారెట్స్ ఎసోఫేగస్” (Barrett’s esophagus) సమస్య లో గ్లాండులార్ కణాలు అన్నవాహిక యొక్క స్క్వామస్ కణాల స్థానంలోకి వస్తాయి, ఇది అడెనోకార్సినోమాకు దారితీస్తుంది. SCC సంభవం ఎక్కువగా ఉన్నప్పటికీ, ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలలో SCC కంటే AC కారణంగా మరణాల రేటు ఎక్కువగా ఉంది.

దాదాపు 95% అన్నవాహిక క్యాన్సర్లు SCC మరియు AC. అన్నవాహిక క్యాన్సర్‌లోని ఇతర అరుదైన రకాలు సార్కోమా (Sarcoma), స్మాల్ సెల్ కార్సినోమా (Small Cell Carcinoma), మెలనోమా (Melanoma), లింఫోమా (Lymphoma) మరియు కోరియోకార్సినోమా (Choriocarcinoma). అన్నవాహిక క్యాన్సర్ రకాన్ని తెలుసుకోవడం, ఉత్తమ చికిత్స ఎంపికలను నిర్ణయించడంలో సహాయపడుతుంది.

భారతదేశంలో అన్నవాహిక క్యాన్సర్ ఎంత సాధారణం?

తాజా గణాంకాల ప్రకారం, అన్నవాహిక క్యాన్సర్ భారతదేశంలో 5వ అత్యంత సాధారణ క్యాన్సర్. 2020లో దాదాపు 63,180 కొత్త కేసులు నమోదయ్యాయి.

ఈ క్యాన్సర్ సంభవం రేటు స్త్రీలలో (3.4%) కంటే పురుషులలో (6.1%) ఎక్కువగా ఉందని గణాంకాలు సూచిస్తున్నాయి.

నాకు అన్నవాహిక క్యాన్సర్ ఉందో లేదో తెలుసుకోవడం ఎలా?

అన్నవాహిక క్యాన్సర్ (Esophageal Cancer) సాధారణంగా దాని ప్రారంభ దశలలో ఎటువంటి లక్షణాలను కలిగి ఉండదు. అందువల్ల, ఇది ఇతర శరీర భాగాలకు వ్యాపించిన తర్వాత నిర్ధారణ అవుతుంది.

అయినప్పటికీ, కొన్ని లక్షణాలు అన్నవాహిక క్యాన్సర్‌ను సూచిస్తాయి:

 • మింగడంలో ఇబ్బంది
 • తెలియని కారణాల వల్ల బరువు తగ్గడం
 • ఆకలి లేకపోవడం
 • గొంతు లేదా ఛాతీ మధ్యలో నొప్పి, ముఖ్యంగా మింగేటప్పుడు
 • తీవ్రమైన అజీర్ణం లేదా గుండెల్లో మంట
 • అలసట/ఆయాసము 

మీకు ఈ సంకేతాలు మరియు లక్షణాలు ఏవైనా ఉంటే, రోగ నిర్ధారణ చేయడానికి తదుపరి పరీక్షల కోసం వైద్యుడిని సంప్రదించండి.

మీ అన్నవాహిక క్యాన్సర్ కోసం మీరు ఇక్కడ మా వైద్యులతో అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవచ్చు. సరైన వైద్యుడిని కనుగొనడంలో మీకు ఏదైనా సహాయం కావాలంటే మీరు మాకు 79965 79965కు కాల్ చేయవచ్చు.

అన్నవాహిక క్యాన్సర్‌ని ఎలా నిర్ధారిస్తారు?

మీ వైద్యుడు మీ యొక్క లక్షణాలు మరియు వైద్య చరిత్ర గురించి అడుగుతారు మరియు మిమ్మల్ని నిశితంగా పరిశీలిస్తారు. మీ సాధారణ ఆరోగ్యాన్ని తనిఖీ చేయడానికి రక్త పరీక్షలు కూడా చేయవచ్చు.

అన్నవాహిక క్యాన్సర్ సంకేతాలు ఏమైనా ఉంటే, తదుపరి రోగనిర్ధారణ పరీక్షలు చేయవచ్చు, వీటిలో కొన్ని:

బేరియం స్వాలో పరీక్ష (Barium swallow study)

ఈ రోగనిర్ధారణ పరీక్షలో, బేరియం (Barium) కలిగిన ద్రవాన్ని మింగమని మీ వైద్యుడు మిమ్మల్ని అడుగుతారు. బేరియం అనేది రేడియోప్యాక్ (Radiopaque) పదార్ధం, అంటే ఇది X- కిరణాలను గ్రహించి శరీరం లోపల యొక్క స్పష్టమైన చిత్రాన్ని ఇస్తుంది. బేరియం తీసుకున్న తర్వాత, అది మీ అన్నవాహిక లోపలి పొరను కప్పి, కణజాలంలో మార్పులను X-రే చిత్రంలో చూపుతుంది. ఇది అన్నవాహికలో ఏదైనా అసాధారణ కణజాల పెరుగుదల లేదా అడ్డంకులు ఉన్నట్లయితే గుర్తించడానికి వైద్యుడికి సహాయపడుతుంది.

Barium is an radiopaque material which is used to detect Esophageal Cancer

ఎండోస్కోపీ (Endoscopy)

ఎండోస్కోప్ (Endoscope) అని పిలువబడే ఒక వైపు కెమెరా ఉన్న మృదువైన మరియు వంగదగిన ట్యూబ్ మీ గొంతులోకి పంపబడుతుంది. ఈ రోగనిర్ధారణ పరీక్ష అన్నవాహిక క్యాన్సర్ లేదా అన్నవాహికలో అడ్డంకులు ఉన్న ప్రాంతాలను చూడటానికి సహాయపడుతుంది.

Endoscopy is performed by inserting a lighting tube also called Endoscope into the esophagus

బయాప్సీ (Biopsy)

ఈ రోగనిర్ధారణ పరీక్ష కోసం, క్యాన్సర్ ఉన్నట్లు అనుమానించబడిన కణజాలం యొక్క చిన్న నమూనాను సేకరించడానికి ఒక ప్రత్యేక ఎండోస్కోప్ గొంతులోకి పంపబడుతుంది. ఇలా సేకరించిన నమూనాను క్యాన్సర్‌ను గుర్తించేందుకు ప్రయోగశాలలో (laboratory) పరీక్షిస్తారు.

ఈ రోగనిర్ధారణ పరీక్ష అన్నవాహికలోని కణాలు ఆరోగ్యంగా ఉన్నాయా లేదా క్యాన్సర్‌తో ఉన్నాయా మరియు ఏ క్యాన్సర్ దశలో ఉన్నాయనే దాని గురించి కీలకమైన సమాచారాన్ని అందిస్తుంది.

కంప్యూటెడ్ టోమోగ్రఫీ (CT) స్కాన్, మాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్ (MRI) స్కాన్, పాజిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ (PET) స్కాన్ వంటి ఇతర ఇమేజింగ్ పరీక్షలు కూడా అన్నవాహిక క్యాన్సర్‌ని నిర్ధారించడానికి చేయవచ్చు.

అన్నవాహిక క్యాన్సర్ యొక్క దశను కనుగొనడానికి, క్యాన్సర్ శోషరస కణుపులకు (lymph nodes) లేదా శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించిందో లేదో తెలుసుకోవడానికి తదుపరి పరీక్షలు చేస్తారు. ఈ పరీక్షలు క్రింది విధంగా ఉండవచ్చు:

 • బ్రోంకోస్కోపీ (Bronchoscopy)

బ్రోంకోస్కోప్, ఇది ఒక సన్నని, కాంతివంతమైన ట్యూబ్, శ్వాసనాళాలను పరిశీలించడానికి ముక్కు లేదా నోటిలోకి చొప్పించబడుతుంది. ఈ పరీక్ష శ్వాసనాళాల్లో క్యాన్సర్‌ను గుర్తించడంలో సహాయపడుతుంది.

A lighting tube is inserted through the nose or mouth to examine the airways

 • ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ (Endoscopic ultrasound)

ఈ పరీక్షలో, ఎండోస్కోపీలో మాదిరిగా, ఎండోస్కోప్ ట్యూబ్ గొంతు ద్వారా అన్నవాహికలోకి పంపబడుతుంది. చిన్న అల్ట్రాసౌండ్ పరికరంతో ఎండోస్కోప్ ట్యూబ్ జతచేయబడి ఉంటుంది. ట్యూబ్‌కు జోడించబడిన కెమెరాతో పాటు అల్ట్రాసౌండ్ పరికరం శరీరంలోని అవయవాల యొక్క ధ్వని తరంగాలను ఉపయోగించి శరీరంలోని అంతర్గత అవయవాల చిత్రాలను రూపొందిస్తుంది. ఈ పరీక్ష కణితి పరిమాణం మరియు విస్తీర్ణంపై మరిన్ని వివరాలను అందిస్తుంది.

 • CT స్కాన్

ఈ పరీక్షలో, శరీరం యొక్క 2-D క్రాస్ సెక్షనల్ చిత్రాలను రూపొందించడానికి కిరణాల శ్రేణి శరీరం గుండా పంపబడుతుంది. ఇది X-రే చిత్రం కంటే మరింత వివరణాత్మక చిత్రాన్ని అందిస్తుంది.

 • PET స్కాన్

సురక్షితమైన రేడియోధార్మిక రసాయనం శరీరంలోకి ఇంజెక్షన్ ద్వారా ఇవ్వబడుతుంది. ఈ రసాయనం ఎక్కువగా కణితి కణాలచే గ్రహించబడుతుంది మరియు PET స్కానర్ ద్వారా ఆ కణితిని గుర్తిస్తారు. PET స్కాన్ అవయవాలు మరియు కణజాలాల చిత్రాలను ఇస్తుంది.

 • థొరాకోస్కోపీ (Thoracoscopy)

శోషరస కణుపులు మరియు ఇతర ఛాతీ అవయవాలను చూడడానికి ఛాతీకి ఒక చిన్న కట్ చేసి, ఆ కట్ ద్వారా ఎండోస్కోప్ ట్యూబ్ చొప్పించబడుతుంది. ఈ పరీక్ష సమయంలో, బయాప్సీలను కూడా నిర్వహించవచ్చు.

 • లాపరోస్కోపీ (Laparoscopy)

పొత్తికడుపులో ఒక చిన్న కట్ చేసి, ఆ కట్ ద్వారా కాంతిని ఇచ్చే ట్యూబ్ ని పంపిస్తారు. దీని ద్వారా అవయవాలను పరిశీలించడానికి మరియు క్యాన్సర్ వ్యాప్తిని అంచనా వేయడానికి కణజాల నమూనాలను (tissue samples) సేకరిస్తారు.

క్యాన్సర్ పరిమాణం మరియు వ్యాప్తి యొక్క పరిధి ఆధారంగా, అన్నవాహిక క్యాన్సర్‌లు ఐదు ప్రాథమిక దశలుగా వర్గీకరించబడ్డాయి, ఇవి రోమన్ సంఖ్యలు 0 నుండి IV వరకు సూచించబడతాయి.

“దశ 0 అనేది క్యాన్సర్ పరిమాణంలో చిన్నది మరియు అన్నవాహిక యొక్క ఉపరితల పొరలను మాత్రమే ప్రభావితం చేస్తుంది, అయితే దశ IV అంటే క్యాన్సర్ శరీరంలోని ఇతర సుదూర భాగాలకు వ్యాపించింది.”

క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్సలో పురోగతి కారణంగా, క్యాన్సర్ స్టేజింగ్ సిస్టమ్ మరింత క్లిష్టంగా మారుతోంది. క్యాన్సర్ దశను ఖచ్చితంగా తెలుసుకోవడం మీ కేసు గురించి మరింత సమాచారాన్ని అందిస్తుంది, ఇది మీ క్యాన్సర్ చికిత్సను ఉత్తమంగా ప్లాన్ చేయడంలో సహాయపడుతుంది.

అన్నవాహిక క్యాన్సర్‌కు ఎలా చికిత్స చేస్తారు?

అన్నవాహిక క్యాన్సర్ చికిత్సకు మల్టీడిసిప్లినరీ (multidisciplinary) విధానం అవసరం; చాలా మంది రోగులలో, చికిత్సలో మెడికల్, శస్త్రచికిత్స మరియు రేడియేషన్ చికిత్సలు అవసరం అవుతాయి. ఏ రకం చికిత్స ఎంచుకోవాలి అనేది అన్నవాహిక క్యాన్సర్ రకం, దాని దశ, దాని స్థానం, మీ మొత్తం ఆరోగ్యం మరియు మీ ప్రాధాన్యతలపై ఆధారపడి ఉంటుంది.

సరైన చికిత్సను పొందడంలో మా మల్టీడిసిప్లినరీ ట్యూమర్ బోర్డ్ మీకు ఎలా ప్రయోజనం చేకూరుస్తుందో ఇక్కడ చూడండి

మీ వైద్యులు విభిన్న చికిత్సా విధానాలు, వాటి ప్రయోజనాలు మరియు దుష్ప్రభావాలను వివరిస్తారు మరియు చికిత్స నిర్ణయాలు తీసుకోవడంలో మీకు సహాయం చేస్తారు. వైద్యుల బృందం మీ కేసుకు సాధ్యమైనంత ఉత్తమమైన ఫలితాన్ని అందించే చికిత్సను అందిస్తుంది.

క్లుప్తంగా చర్చించబడిన కొన్ని చికిత్సా విధానాలు:

 1. శస్త్ర చికిత్స (Surgery)

అన్నవాహిక క్యాన్సర్‌కు చికిత్స చేయడానికి చేసే శస్త్రచికిత్స రకం కణితి యొక్క పరిమాణం మరియు స్థానం, మరియు మీ సర్జికల్ ఆంకాలజిస్ట్ ఉపయోగించే సాంకేతికతపై ఆధారపడి ఉంటుంది.

అన్నవాహిక క్యాన్సర్ కోసం శస్త్రచికిత్స సాధారణంగా అన్నవాహికను తొలగించడానికి చేయబడుతుంది, ఇది వివిధ పద్ధతుల ద్వారా చేయవచ్చు:

 • ఈసోఫాజెక్టమీ (Esophagectomy)

ఈ ప్రక్రియలో, అన్నవాహికలో క్యాన్సర్ ఉన్న కొంత భాగం మరియు కడుపులోని కొంత భాగం తొలగించబడుతుంది. అన్నవాహిక యొక్క మిగిలిన భాగం కడుపుతో కనెక్ట్ చేస్తారు. 

కొన్నిసార్లు, మొత్తం అన్నవాహిక తొలగించబడుతుంది, దీనిని టోటల్ ఈసోఫాజెక్టమీ (Total Esophagectomy) అంటారు. ఈ ప్రక్రియను పెద్ద కోతలు చేయడం ద్వారా లేదా ప్రత్యేక శస్త్రచికిత్సా సాధనాలను (లాపరోస్కోపీ/రోబోటిక్) ఉపయోగించి అనేక చిన్న కోతల ద్వారా నిర్వహించవచ్చు. అన్నవాహిక  యొక్క సాధారణ విధులను పునరుద్ధరించడానికి  అన్నవాహికను కడుపు  లేదా జెజ్యునం (చిన్నప్రేగులో ఒక భాగం) లేదా కోలాన్ (పెద్దప్రేగులో ఒక భాగం)తో పునర్నిర్మించబడుతుంది.

ఈసోఫాజెక్టమీ యొక్క ప్రధాన ప్రమాదాలలో రక్తస్రావం, రక్తం గడ్డకట్టడం, ఇన్ఫెక్షన్, న్యుమోనియా (pneumonia), గొంతు బొంగురుపోవడం, మింగడంలో సమస్యలు, శోషరస ద్రవాలు లీకేజ్(lymphatic leakage) లేదా అన్నవాహిక మరియు కడుపు కనెక్ట్ చేసిన ప్రాంతంలో లీక్ అవ్వడం వంటివి ఎదుర్కోవచ్చు.

Esophagectomy is done to remove cancerous part of the esophagus and small part of the stomach if necessary

 • ఈసోఫాగోగాస్ట్రెక్టమీ (Esophagogastrectomy)

అన్నవాహికలో కొంత భాగం, పొట్టలోని పై భాగం మరియు సమీపంలోని శోషరస కణుపులు తొలగించబడతాయి మరియు మిగిలిన కడుపు భాగం పైకి లాగి అన్నవాహికకు తిరిగి జోడించబడుతుంది.

ఈసోఫాగోగాస్ట్రెక్టమీ ఊపిరితిత్తుల సమస్యలైన ప్లూరల్ ఎఫ్యూషన్ (pleural effusion) మరియు న్యుమోనియా, మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ (myocardial infarction) మరియు కార్డియాక్ అరిథ్మియాసిస్ (cardiac arrhythmias) వంటి గుండె సమస్యలు, అలాగే ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం, మరియు కడుపు మరియు అన్నవాహిక మధ్య కొత్త కనెక్షన్ నుండి లీకేజీకి దారితీయవచ్చు.

   2.    కీమోథెరపీ (Chemotherapy)

కీమోథెరపీలో, యాంటీక్యాన్సర్ (Anticancer) మందులు ఇస్తారు. ఇవి రక్తప్రవాహంలో కలిసి శరీరమంతా ప్రసరించి క్యాన్సర్ కణాలను చంపుతాయి.

ఎటువంటి కీమోథెరపీ మందులు ఇవ్వాలి అనేది క్యాన్సర్ రకం మరియు దశపై ఆధారపడి ఉంటుంది. కీమోథెరపీని శస్త్రచికిత్సకు ముందు లేదా తర్వాత ఇవ్వవచ్చు లేదా రేడియోథెరపీతో కలిపి కూడా చేయవచ్చు.

అడ్వాన్స్‌డ్ అన్నవాహిక క్యాన్సర్‌ల (advanced esophageal cancers) సందర్భాలలో, క్యాన్సర్ లక్షణాల నుండి ఉపశమనం పొందేందుకు మరియు మనుగడను (survival rates) పెంచడానికి కీమోథెరపీని ఉపయోగిస్తారు.

అడ్వాన్స్‌డ్ అన్నవాహిక క్యాన్సర్ కేసులకు, ఇమ్యునోథెరపీ మరియు టార్గెటెడ్ థెరపీ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇమ్యునోథెరపీలో రాముసిరుమాబ్ (Ramucirumab), ట్రస్టూజుమాబ్ (Trastuzumab) మరియు ఇమ్యునోమోడ్యులేటర్స్ (Immunomodulators), నివోలుమాబ్ (Nivolumab) మరియు పెంబ్రోలిజుమాబ్‌లతో (Pembrolizumab) చికిత్స ఉంటుంది.

కీమోథెరపీ యొక్క దుష్ప్రభావాలు తీసుకున్న మందుల రకాలపై ఆధారపడి ఉంటాయి. కొన్ని దుష్ప్రభావాలు వికారం, వాంతులు, జుట్టు రాలడం, నోటి పుండ్లు, ఆకలి లేకపోవడం, విరేచనాలు లేదా మలబద్ధకం.

   3.   రేడియోథెరపీ (Radiotherapy)

రేడియేషన్ థెరపీలో అధిక-శక్తి గల ప్రోటాన్‌లు లేదా X – కిరణాలు ఒక యంత్రం (ఎక్స్టర్నల్ బీమ్ రేడియేషన్) నుండి విడుదలవుతాయి. ఈ  రేడియేషన్ కిరణాలు క్యాన్సర్ కణాలను లక్ష్యంగా చేసుకుని వాటిని చంపుతాయి.

ఈ రకమైన రేడియేషన్ థెరపీని సాధారణంగా అన్నవాహిక క్యాన్సర్ చికిత్సకు ఉపయోగిస్తారు. కొన్నిసార్లు, రేడియేషన్ విడుదల చేసే పదార్థాన్ని శరీరం లోపల క్యాన్సర్ ఉన్న దగ్గర ఉంచవచ్చు, దీనిని బ్రాకీథెరపీ (Brachytherapy) అంటారు.

రేడియేషన్ థెరపీని కీమోథెరపీతో కలిపి ఇవ్వవచ్చు లేదా శస్త్రచికిత్సకు ముందు లేదా తర్వాత ఇవ్వవచ్చు. క్యాన్సర్ లక్షణాల నుండి ఉపశమనానికి వ్యాప్తి చెందిన క్యాన్సర్‌లకు చికిత్స చేయడంలో కూడా దీనిని ఉపయోగించవచ్చు. అన్నవాహికలో క్యాన్సర్ కణితి  ఆహారం తీసుకోవడం నిరోధించేంత పెద్దదిగా పెరుగినప్పుడు  లేదా కణితి నుండి రక్తస్రావం అయినప్పుడు రేడియేషన్ థెరపీని ఉపయోగిస్తారు.

రేడియేషన్ థెరపీ చికిత్స సమయంలో లేదా చికిత్స పూర్తయిన తర్వాత కొన్ని దుష్ప్రభావాలను కూడా కలిగిస్తుంది. కొన్ని దుష్ప్రభావాలు మింగడంలో నొప్పి లేదా ఇబ్బంది, చర్మం ఎరుపు లేదా దద్దుర్లు మరియు సమీపంలోని అవయవాలకు కొద్దిపాటి హాని కలిగిస్తాయి.

అన్నవాహిక క్యాన్సర్ చికిత్స సమయంలో ఏ ఆహారాలు తీసుకోవాలి?

అన్నవాహిక క్యాన్సర్ (Esophageal Cancer) ఆహారాన్ని మింగడం కష్టతరం చేస్తుంది మరియు నొప్పిని కలిగిస్తుంది, అందువల్ల అందువల్ల కావాల్సినంత పోషకాహారాన్ని రోగులు తీసుకోలేకపోవచ్చు.

చాలా మంది రోగులు బరువు తగ్గడం మరియు పోషకాహార లోపంతో చికిత్సను నిలిపివేసేందుకు కూడా దారితీస్తుంది.

మీ ఆరోగ్యకరమైన బరువును మరియు శారీరక బలాన్ని పెంపొందించడానికి, ఇన్ఫెక్షన్‌తో పోరాడటానికి, దుష్ప్రభావాలను ఎదుర్కోవటానికి మరియు చికిత్స నుండి కోలుకునే ప్రక్రియను వేగవంతం చేయడానికి క్యాన్సర్ చికిత్సకు ముందు, చికిత్స సమయంలో మరియు తర్వాత తగినంత పోషకాహారాన్ని పొందడం చాలా అవసరం.

Healthy and Right nutritive foods are important during esophageal cancer treatment

మీకు సహాయపడే కొన్ని చిట్కాలు ఇక్కడ ఉన్నాయి:

 • గుడ్లు, జున్ను, పెరుగు, పీనట్ బటర్ మొదలైన క్యాలరీలు మరియు ప్రొటీన్‌లు అధికంగా ఉండే ఆహారాలను తీసుకోండి.
 • మీ ఆహారాన్ని సాస్‌లు లేదా కూరలతో మృదువుగా చేయండి లేదా మింగడం కష్టంగా ఉంటే ఆహారాన్ని చిన్న మొత్తంలో తీసుకోండి.
 • మధ్య మధ్యలో విరామం ఇస్తూ తక్కువ మొత్తంలో ఎక్కువసార్లు  భోజనం చేయండి.
 • మింగడం సులభతరం చేయడానికి ఆహారాన్ని తినేటప్పుడు ఏవైనా ద్రవాలు త్రాగండి.

మరింత సహాయం కోసం నమోదిత పోషకాహార నిపుణుడిని (Registered nutritionist) సంప్రదించండి. మీ పోషకాహార నిపుణుడు మీరు మంచి పోషకాహారాన్ని పొందడంలో సహాయం చేస్తారు మరియు చికిత్స నుండి త్వరగా కోలుకోవడానికి సహాయం చేస్తారు.

మీరు స్వంతంగా తినడం లేదా త్రాగడం ద్వారా తగినంత పోషకాహారాన్ని పొందలేకపోతే, ఒక ఫీడింగ్ ట్యూబ్‌ని మీ కడుపులోకి పెడతారు. ఫీడింగ్ ట్యూబ్‌లు వివిధ రకాలుగా ఉన్నాయి.

 1. జెజ్యునోస్టమీ ట్యూబ్ (Jejunostomy tube-J ట్యూబ్)

ఇది ఒక మృదువైన ప్లాస్టిక్ ట్యూబ్. ఇది మీ కడుపు చర్మం ద్వారా చొప్పించి చిన్న ప్రేగు యొక్క మధ్య భాగానికి జోడిస్తారు.

Jejunostomy or J-tube is fixed for food intake

     2.  నాసోగ్యాస్ట్రిక్ ట్యూబ్ (Nasogastric tube – NG ట్యూబ్)

ఈ ట్యూబ్ ముక్కులో నుంచి అన్నవాహిక ద్వారా కడుపులోకి పెడతారు. ఇది ఎండోస్కోపీ ప్రక్రియ ద్వారా కూడా చేయవచ్చు.

Nasogastric tube is inserted through the nose into the stomach for food intake

     3. పర్క్యుటేనియస్ ఎండోస్కోపిక్ గ్యాస్ట్రోస్టమీ (Percutaneous endoscopic gastrostomy – PEG ట్యూబ్)

ఈ ట్యూబ్ పొత్తికడుపు చర్మం మరియు కండరాల ద్వారా నేరుగా కడుపులోకి పంపబడుతుంది.

PEG tube is inserted through the skin or stomach muscles into the stomach

మీరు ఫీడింగ్ ట్యూబ్‌ని ఉపయోగిస్తుంటే, కొన్ని కచ్చితమైన ఆహార నియమాలు పాటించాలి.  సరైన ఆహారం మీ అన్నవాహిక మరియు కడుపును నయం చేయడంలో సహాయపడుతుంది. ఈ ఆహారం ద్రవ రూపంలో ప్రారంభమవుతుంది మరియు నెమ్మదిగా మృదువైన ఆహారంలోకి మారుతుంది.

అన్నవాహిక మరియు కడుపు నయం అయినప్పుడు, ఫీడింగ్ ట్యూబ్ తొలగించబడుతుంది మరియు మీరు నెమ్మదిగా తాగడం మరియు తినడం ప్రారంభించవచ్చు.

మీ పరిస్థితికి తగిన ఆహార ప్రణాళిక మీకు కావాలంటే, 79965 79965కు కాల్ చేయడం ద్వారా మా పోషకాహార నిపుణుడిని సంప్రదించవచ్చు.

Related Posts

Leave a Comment