ఊపిరితిత్తుల క్యాన్సర్ చికిత్సలో తాజా పురోగతులు

by Team Onco
405 views

ఊపిరితిత్తుల క్యాన్సర్ రెండవ అత్యంత సాధారణ క్యాన్సర్, ప్రధానంగా 65 ఏళ్లు పైబడిన పురుషులను ప్రభావితం చేస్తుంది.

ప్రపంచవ్యాప్తంగా 17 లక్షల ప్రజలకు సంభవించి, ఇది క్యాన్సర్ సంబంధిత మరణాలకు అత్యంత సాధారణ కారణంగా మారింది. భారతదేశంలో, ఇప్పటివరకు ఇది ప్రతి సంవత్సరం 72,510 మందిని ప్రభావితం చేసింది మరియు 66,279 మంది మరణాలకు కారణమైంది.

ఊపిరితిత్తుల క్యాన్సర్‌లను శస్త్రచికిత్స, కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ, టార్గెటెడ్ థెరపీ, ఇమ్యునోథెరపీ లేదా ఈ చికిత్సల కలయికతో చికిత్స చేయవచ్చు.

గత కొన్ని సంవత్సరాలుగా, ఊపిరితిత్తుల క్యాన్సర్ చికిత్స విధానాలు అభివృద్ధి చెందుతున్నాయి. 

ఊపిరితిత్తుల క్యాన్సర్ యొక్క స్టేజింగ్ ప్రక్రియ మరియు క్యాన్సర్ లక్షణాలు మారనప్పటికీ, తాజా సాంకేతికత చాలా మంది రోగులకు వ్యక్తిగతీకరించిన చికిత్స (personalised) ప్రణాళికలను పొందేలా చేసింది.

ఊపిరితిత్తుల క్యాన్సర్ కారణాలు, లక్షణాలు మరియు రోగ నిర్ధారణ గురించి తెలుసుకోండి: https://onco.com/blog/lung-cancer-telugu/

1. ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు శస్త్ర చికిత్స

ప్రారంభ దశలో ఉన్న ఊపిరితిత్తుల క్యాన్సర్లకు శస్త్రచికిత్స (surgery) అనేది ప్రాథమిక చికిత్సా విధానం.

చాలా కాలం క్రితం 1933లో, ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు చికిత్స చేయడానికి మొట్టమొదటిసారి న్యుమోనెక్టమీ (pneumonectomy) అనే శస్త్రచికిత్సా విధానాన్ని ఉపయోగించి ఊపిరితిత్తులను తొలగించారు. అప్పటి నుండి, ఇది చాలా సంవత్సరాలు ప్రామాణిక చికిత్సగా (standard treatment) ఉంది.

1960 లో, లోబెక్టమీ (lobectomy) అనే శస్త్రచికిత్స విధానాన్ని ఉపయోగించారు. ఈ శస్త్రచికిత్సలో ఊపిరితిత్తులలోని క్యాన్సర్ ప్రభావిత భాగాన్ని మాత్రమే తొలగించడం జరుగుతుంది.  ఈ పద్దతి కూడా న్యుమోనెక్టమీ (pneumonectomy) వలె ప్రభావవంతంగా ఉంటుంది మరియు తక్కువ దుష్ప్రభావాలను కలిగిస్తుంది.

  • మినిమల్లీ ఇన్వాసివ్ వీడియో-అసిస్టెడ్ థొరాకోస్కోపిక్ సర్జరీ:

1990ల ప్రారంభంలో ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు సంబంధించిన శస్త్రచికిత్సా విధానాలలో మినిమల్లీ ఇన్వాసివ్ వీడియో-అసిస్టెడ్ థొరాకోస్కోపిక్ సర్జరీ (VATS;Minimally invasive video-assisted thoracoscopic surgery) ఒక పద్ధతిగా అభివృద్ధి చేయబడింది. ఇది గత 25 సంవత్సరాలుగా గణనీయంగా అభివృద్ధి చెందుతూనే ఉంది.

VATS అనేది ఒక రకమైన మినిమల్లీ ఇన్వాసివ్ సర్జరీ. చికిత్స చేయవలసిన ప్రదేశంలో చిన్న చిన్న కట్‌లు చేసి, ఆ కట్‌ల ద్వారా ప్రత్యేక పరికరాలను మరియు ఒక చిన్న కెమెరాను చొప్పించి శస్త్రచికిత్స నిర్వహించబడుతుంది.

ఈ శస్త్రచికిత్స సమయంలో, ఛాతీ వద్ద ఒక పెద్ద కోత చేసే ఓపెన్ సర్జరీ వలె కాకుండా మూడు నుండి నాలుగు చిన్న కోతలు చేయబడతాయి.

థొరాకోస్కోప్ (thoracoscope; ఛాతీ లోపలి భాగాన్ని వీక్షించడానికి లెన్స్ కలిగి ఉండే మరియు కాంతిని ఇచ్చే ట్యూబ్ లాంటి పరికరం) మీ ఛాతీ లోపలి భాగాన్ని కంప్యూటర్ పై చూపిస్తూ,  ప్రక్రియను నిర్వహించడంలో వైద్యునికి సహాయం చేస్తుంది.

ఓపెన్ సర్జరీతో పోలిస్తే, మినిమల్లీ ఇన్వాసివ్ సర్జరీ చేయించుకున్న రోగులకు శస్త్రచికిత్స వల్ల కలిగే నొప్పి తక్కువగా ఉంటుంది, ఎక్కువ రోజులు ఆసుపత్రిలో ఉండనవసరం లేదు, చికిత్స నుండి వేగంగా కోలుకోవచ్చు, మరియు రక్తస్రావం మరియు ఇన్‌ఫెక్షన్లు వచ్చే అవకాశాలు కూడా  తక్కువే.  

  • VATS లోబెక్టమీ

లోబెక్టమీ (Lobectomy) అనేది ఊపిరితిత్తుల క్యాన్సర్ చికిత్సకు చేసే అత్యంత సాధారణ శస్త్రచికిత్స. లోబెక్టమీ ఇంతకు ముందు ఓపెన్ సర్జరీ ద్వారా చేసేవారు. కానీ ఇప్పుడు అది మినిమల్లీ ఇన్వాసివ్ విధానాన్ని ఉపయోగించి కూడా చేయవచ్చు.

ఓపెన్ సర్జరీతో పోలిస్తే, రోగి VATS లోబెక్టమీతో తక్కువ సమయం ఆసుపత్రిలో ఉండవచ్చు (మాములుగా 3 రోజులు), మరియు తక్కువ నొప్పితో మరింత వేగంగా కోలుకోవచ్చు.

2. ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు రేడియేషన్ చికిత్స

రేడియేషన్ థెరపీ అధిక మోతాదులో రేడియేషన్ కిరణాలను ఉపయోగించి వేగంగా విభజించే క్యాన్సర్ కణాలను నాశనం చేస్తుంది. రేడియేషన్ థెరపీ యొక్క ప్రధాన లక్ష్యం ఊపిరితిత్తుల కణితికి తగినంత రేడియేషన్ మోతాదును అందిస్తూనే, చుట్టూవుండే ఆరోగ్యకరమైన అవయవాలకు మోతాదును తగ్గించడం.

Radiation treatment for lung cancer in telugu

రేడియేషన్‌ను ఖచ్చితంగా కణితికి అందించేలా ఆధునిక సాంకేతికతలు అందుబాటులో ఉన్నాయి. ఫలితంగా రేడియేషన్‌ ప్రభావం చుట్టుపక్కల ఉన్న ఆరోగ్యకరమైన కణజాలాలపై తక్కువ ఉంటుంది, తద్వారా దుష్ప్రభావాలు తగ్గుతాయి.

కణితికి రేడియేషన్‌ను ఖచ్చితంగా అందించడానికి;

  • ఇంటెన్సిటీ-మాడ్యులేటెడ్ రేడియేషన్ థెరపీ (IMRT)
  • ఇమేజ్-గైడెడ్ రేడియేషన్ థెరపీ (IGRT)
  • స్టీరియోటాక్టిక్ బాడీ రేడియేషన్ థెరపీ (SBRT) మరియు
  • ప్రోటాన్ బీమ్ థెరపీ (PBT) వంటి అధునాతన రేడియేషన్ చికిత్సలు అభివృద్ధి చెందాయి

రేడియేషన్ చికిత్స క్యాన్సర్ యొక్క అన్ని దశలలో “నివారణ చికిత్స (curative treatment)” లేదా “ఉపశమన చికిత్సగా (palliative treatment)” ఇవ్వబడుతుంది.

రేడియేషన్ థెరపీని; 

  • ప్రాథమిక చికిత్సగా ఇస్తారు 
  • శస్త్రచికిత్స తర్వాత, చికిత్స చేసిన ప్రాంతంలో ఇంకా క్యాన్సర్ కణాలు మిగిలి ఉంటే, వాటిని నాశనం చేయడానికి ఇస్తారు 
  • మెదడు లేదా శరీరంలోని ఇతర ప్రాంతాలకు వ్యాపించిన ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు చికిత్స చేయడానికి లేదా క్యాన్సర్ లక్షణాలను తగ్గించడానికి కూడా ఇస్తారు 

ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు రేడియేషన్ చికిత్సలో తాజా పద్ధతులు క్రింద చర్చించబడ్డాయి.

  • ఇంటెన్సిటీ-మాడ్యులేటెడ్ రేడియేషన్ థెరపీ (IMRT)

ఈ అధునాతన రేడియోథెరపీ రేడియేషన్ మోతాదును కణితి చుట్టూ ఉన్న ఆరోగ్యకరమైన కణజాలంపై పడకుండా, కణితికి మాత్రమే పంపిస్తుంది మరియు క్యాన్సర్ ని నయం చేసే అవకాశాలను పెంచుతుంది.

IGRT అనేది IMRT యొక్క ప్రత్యేక రకం. ఇది చికిత్సకు ముందు మరియు చికిత్స సమయంలో రోగి యొక్క స్థానం మరియు కణితి స్థానాన్ని తెలుసుకోవడానికి స్కాన్‌లను ఉపయోగిస్తుంది.

IGRT మీ శరీరం యొక్క స్థితిని తెలుసుకోవడానికి వివిధ రకాల 2-D, 3-D మరియు 4-D ఇమేజింగ్ స్కాన్‌లను ఉపయోగిస్తుంది. తద్వారా సమీపంలోని ఆరోగ్యకరమైన కణాలు మరియు అవయవాలకు హానిని తగ్గిస్తూ, రేడియేషన్ కిరణాలు కణితి వైపు జాగ్రత్తగా పంపబడతాయి.

  • స్టీరియోటాక్టిక్ బాడీ రేడియేషన్ థెరపీ (SBRT)

దీనిని స్టీరియోటాక్టిక్ అబ్లేటివ్ రేడియోథెరపీ (SABR) అని కూడా అంటారు. ఇది ఒక రకమైన రేడియేషన్ థెరపీ, ఇది సాధారణంగా 1 నుండి 5 సెషన్లలో ఇవ్వబడుతుంది. ఇక్కడ అధిక-మోతాదు రేడియేషన్ కిరణాలు కణితి వైపు అధిక ఖచ్చితత్వంతో పంపబడతాయి.

ఇది చాలా తరచుగా ప్రారంభ-దశ ఊపిరితిత్తుల క్యాన్సర్లకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు, ముఖ్యంగా ఆరోగ్య పరిస్థితి సరిగా లేని మరియు శస్త్రచికిత్స చేయించుకోలేని రోగులకు.

సాధారణ రేడియోథెరపీ కంటే SBRT యొక్క ప్రయోజనం:

సాధారణ రేడియేషన్ చికిత్సలో, తక్కువ మోతాదులలో రేడియేషన్ ను అనేక వారాల పాటు ఇస్తారు. అయితే SBRTలో, అధిక మోతాదులలో రేడియేషన్ ను చాలా తక్కువ కాలం ఇవ్వబడుతుంది. 

  • ప్రోటాన్ బీమ్ థెరపీ

ఇది రేడియేషన్ థెరపీ యొక్క అధునాతన రూపం, ఇది ఎక్స్-రే రేడియేషన్ థెరపీతో పోలిస్తే, తక్కువ దుష్ప్రభావాలతో ఊపిరితిత్తుల క్యాన్సర్ ను సమర్థవంతంగా చికిత్స చేస్తుంది.

ఊపిరితిత్తుల క్యాన్సర్ చికిత్స కోసం ప్రోటాన్ థెరపీని ఉపయోగించడం ద్వారా, క్యాన్సర్ ఉన్న ప్రదేశానికి ఖచ్చితంగా ప్రోటాన్ల యొక్క అత్యంత ప్రభావవంతమైన మోతాదులను అందించడం సాధ్యమవుతుంది.

ఊపిరితిత్తుల క్యాన్సర్ కోసం ప్రోటాన్ థెరపీ రెండు ప్రధాన సందర్భాలలో ఇవ్వబడుతుంది:

  • ఊపిరితిత్తుల క్యాన్సర్ లేదా ఊపిరితిత్తులలో కణితులు ఛాతీ దాటి వ్యాపించని సందర్భంలో 
  • ఛాతీ దాటి వ్యాప్తిచెందని క్యాన్సర్ కు చికిత్స చేసిన తర్వాత కూడా ఛాతీలో క్యాన్సర్ పునరావృతమయిన సందర్భంలో

3. ఊపిరితిత్తుల క్యాన్సర్ కోసం ఔషధ చికిత్సలు

జన్యువులు (genes) మరియు వాటి మ్యుటేషన్స్ (mutations) పై చేసిన అధ్యయనాలు కొన్ని రకాల ఊపిరితిత్తుల క్యాన్సర్‌లకు కీమోథెరపీ కంటే మెరుగైన చికిత్స ఫలితాలను అందించిన టార్గెటెడ్ థెరపీ కనిపెట్టడానికి దారితీశాయి.

వాస్తవంగా ఏదైనా చికిత్సను నిర్ణయించడానికి స్పష్టమైన రోగ నిర్ధారణ అవసరం.

ఇంతక ముందు వరకు ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ సైటోలజీ (fine needle aspiration cytology) రోగనిర్ధారణ పద్ధతికి ప్రాధాన్యత ఇచ్చేవారు, ఇప్పుడు బయాప్సీ యొక్క ప్రాముఖ్యత అంగీకరించబడింది మరియు విస్తృతంగా నిర్వహించబడుతుంది.

ఈ రోగనిర్ధారణ పరీక్షలు పెద్ద మరియు ఘన కణితి కణజాలాలపై జరుగుతాయి. బయాప్సీ సాధ్యం కానప్పుడు లేదా పరీక్ష కోసం తగినంత కణజాలం లేని సందర్భాల్లో, రక్త ఆధారిత పరీక్షలు కూడా అందుబాటులో ఉంటాయి. సాధారణంగా, ఊపిరితిత్తుల క్యాన్సర్ రోగుల రక్తంలో సెల్-ఫ్రీ (cell-free) ct DNA మరియు సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ (CTC; circulating tumour cells) ఉంటాయి. వాటిని గుర్తించేందుకు ఈ ‘లిక్విడ్ బయాప్సీలు’ (liquid biopsies) చేస్తారు.

4. టార్గెటెడ్ థెరపీ

  • EGFR మ్యుటేషన్ – ఇటువంటి జన్యు మార్పులు అనేక NSCLC అడెనోకార్సినోమాస్‌లో (adenocarcinomas) గుర్తిండం జరిగింది. ఈ రకమైన క్యాన్సర్లు సాధారణంగా ధూమపానం చేయనివారిలో మరియు ఆసియా ప్రజలలో సంభవిస్తాయి.

ఈ EGFR మ్యుటేషన్స్ వల్ల వచ్చిన క్యాన్సర్లకు చికిత్స చేయడానికి Osimertinib, Gefitinib, Afatinib మరియు Erlotinib అనే టార్గెటెడ్ థెరపీ మందులు అందుబాటులో ఉన్నాయి.

  • ALK అనే జన్యువు యొక్క స్థానాల్లో మార్పులు-

ఈ జన్యు మార్పులు తరచుగా ధూమపానం చేయని యువకులలో మరియు అరుదుగా NSCLC అడెనోకార్సినోమాస్‌లో కనిపిస్తాయి.

శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించిన మరియు ఈ జన్యు మార్పులతో కూడిన క్యాన్సర్‌ను చికిత్స చేయడానికి మరియు జీవిత కాలాన్ని పెంచడానికి ఈ క్రింది మందులను ఉపయోగిస్తారు: 

  • క్రిజోటినిబ్ (Crizotinib) 
  • సెరిటినిబ్ (Ceritinib)
  • అలెక్టినిబ్ (Alectinib)
  • బ్రిగటినిబ్ (Brigatinib)
  • లోర్లాటినిబ్ (Lorlatinib)

అలాగే, నిర్దిష్ట జన్యు మార్పులకు చికిత్స చేయగల అనేక అధునాతన టార్గెటెడ్ థెరపీలు అభివృద్ధి చేయబడ్డాయి. సరైన టార్గెటెడ్ థెరపీ అందించడానికి కణితుల్లో జన్యు మార్పులను పరీక్షించడానికి మీ వైద్యుడు కొన్ని బయోమార్కర్ పరీక్షలను (Biomarker tests) చేస్తారు.

క్యాన్సర్ రోగులకు ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడానికి Onco సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ఎలా సహాయపడుతుందో తెలుసుకోండి: https://onco.com/blog/onco-subscription-plan-benefits-cancer-treatment-in-telugu/ 

  1. ఇమ్యునోథెరపీ

ఇమ్యునోథెరపీ క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక మార్పులు చేసింది మరియు వివిధ సందర్భాల్లో మంచి ఫలితాలను చూపించింది. PD L1 పరీక్ష సాధారణంగా ఇతర శరీర భాగాలకు వ్యాపించిన ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉన్న రోగులకు చేయబడుతుంది.

ఎటువంటి మ్యుటేషన్స్ మరియు అసాధారణమైన PDL1 పరీక్ష ఫలితాలు లేని రోగులకు, ఇమ్యునోథెరపీ డ్రగ్ పెంబ్రోలిజుమాబ్‌తో (Pembrolizumab) కలిపి ప్లాటినం-ఆధారిత కీమోథెరపీ సిఫార్సు చేస్తారు.

PDL1 పరీక్ష ఫలితాలు కొద్దిగా అసాధారణంగా ఉన్న రోగులకు, Pembrolizumab, Atezolizumab, Cemiplimab వంటి ఇమ్యునోథెరపీ మందులు కీమోథెరపీతో కలిపి లేదా కలపకుండా ఇస్తారు. ఇలాంటి సందర్భాల్లో పెంబ్రోలిజుమాబ్ అనే ఒకే ఔషధంతో ఇమ్యునోథెరపీ ఉత్తమ ఎంపికగా మారుతోంది. ఇది ప్రతి ఆరు వారాలకు ఒకసారి ఇవ్వడానికి ఆమోదించబడింది మరియు సుదీర్ఘ ఫాలో-అప్ అవసరం. నివోలుమాబ్ మరియు ఇపిలిముమాబ్ ఇతర ప్రత్యామ్నాయాలు.

కొత్త రోగనిర్ధారణ పద్ధతుల ఉపయోగం మరియు జన్యు మార్పుల గురించి మంచి అవగాహన ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు చికిత్సా ఎంపికలను పెంచింది, ఇవి పెద్ద సంఖ్యలో రోగులకు అందుబాటులోకి వస్తున్నాయి.

ఈ అధునాతన చికిత్సలు చాలా వరకు ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో క్లినికల్ ట్రయల్స్‌లో ఉపయోగించబడుతున్నాయి మరియు చాలా మంది రోగులకు ప్రస్తుతం అందుబాటులో లేవు. భవిష్యత్తులో, ఈ చికిత్సలు ప్రతి రోగికి అందుబాటులోకి రావచ్చు.

హైదరాబాద్‌లోని మా Onco క్యాన్సర్ సెంటర్స్ వైద్యులతో అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవడానికి. ఇక్కడ క్లిక్ చేయండి

మీకు క్యాన్సర్ చికిత్సలకు సంబంధించి ఏదైనా సహాయం కావాలంటే, 79965 79965కు కాల్ చేసి మమ్మల్ని సంప్రదించవచ్చు.

Related Posts

Leave a Comment