తెలుగు

లుకేమియా – లక్షణాలు, రోగ నిర్ధారణ, దశలు మరియు చికిత్స

రక్త కణాలను ఉత్పత్తి చేసే ఎముక మజ్జలో ప్రారంభమయ్యే క్యాన్సర్‌లను లుకేమియా (Leukemia) అంటారు. ఎముక మజ్జ అనేది ఎముకల లోపల ఉండే మృదువైన కణజాలం. దీనిలో పూర్తిగా అభివృద్ధి చెందని రక్త కణాలు ఉంటాయి. ఇవి తర్వాత ఎర్ర రక్త కణాలు (RBC), తెల్ల రక్త కణాలు (WBC) మరియు ప్లేట్‌లెట్లు (platelets) వలె అభివృద్ధి చెందుతాయి.

ఎముక మజ్జలోని (bone marrow) కణాలు ఏదైనా మ్యుటేషన్‌కు గురైనప్పుడు, అవి అసాధారణ కణాలుగా విభజించబడటం ప్రారంభిస్తాయి. అసాధారణంగా పెరుగుతున్న ఈ కణాలను లుకేమియా కణాలు అంటారు. కాలక్రమేణా, అవి తగినంత ఆరోగ్యకరమైన రక్త కణాలను ఉత్పత్తి చేసే ఎముక మజ్జ సామర్థ్యాన్ని అణిచివేస్తాయి.

అభివృద్ధి చెందని తెల్ల రక్త కణాలను లుకేమియా కణాలు అంటారు, ఇవి వాటి విధులను నిర్వర్తించలేవు. లుకేమియా ఉన్న రోగులలో, అసాధారణ తెల్ల రక్త కణాలు వేగంగా పెరుగుతాయి.

లుకేమియా యొక్క సంకేతాలు మరియు లక్షణాలు

  • అకారణ జ్వరం
  • తలనొప్పి
  • రక్తస్రావం
  • అలసట
  • కీళ్ళ నొప్పులు 
  • తరచుగా ఇన్ఫెక్షన్లు
  • శోషరస కణుపుల (lymph nodes) పరిమాణంలో పెరుగుదల
  • బరువు తగ్గడం
  • రాత్రి సమయంలో చెమటలు పట్టడం
  • శ్వాస ఆడకపోవుట

లుకేమియాకు కారణమయ్యే ప్రమాద కారకాలు

  • మునుపటి క్యాన్సర్ చికిత్స
  • లుకేమియా యొక్క కుటుంబ చరిత్ర
  • న్యూరోఫైబ్రోమాటోసిస్ (neurofibromatosis), బ్లూమ్ సిండ్రోమ్ (Bloom syndrome), ష్వాచ్‌మన్-డైమండ్ సిండ్రోమ్ (Shwachman-Diamond syndrome) మరియు డౌన్ సిండ్రోమ్ (Down Syndrome) వంటి జన్యుపరమైన రుగ్మతలు.
  • గ్యాసోలిన్, బెంజీన్ మరియు ఫార్మాల్డిహైడ్ వంటి కొన్ని రసాయనాలకు దీర్ఘకాలికంగా గురికావడం.
  • ధూమపానం

లుకేమియా వ్యాధి నిర్ధారణ

రోగి యొక్క సంకేతాలు మరియు క్యాన్సర్ లక్షణాలు, వైద్య చరిత్ర మరియు కుటుంబ చరిత్రపై ఆధారపడి లుకేమియా రోగ నిర్ధారణ చేస్తారు. ఇతర క్యాన్సర్ల మాదిరిగా కాకుండా, లుకేమియా కణాలను X-ray కిరణాల వంటి ఇమేజింగ్ పరీక్షలను ఉపయోగించి గుర్తించలేము.

మీకు లుకేమియా ఉందని మీ వైద్యుడు అనుమానించినట్లయితే తగిన  రోగనిర్ధారణ పరీక్షలను సూచించవచ్చు. అవి ఎంటనగా:

1. శరీరంలోని మొత్తం రక్త కణాల సంఖ్య:

ఈ పరీక్షనే కంప్లీట్ బ్లడ్ కౌంట్ (complete blood count; CBC) అని అంటారు. ఈ పరీక్షలో రోగి యొక్క రక్తం సేకరించి, ఆ రక్తంలో ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, మరియు ప్లేట్‌లెట్స్ స్థాయిలు తనిఖీ చేస్తారు. ఈ కణాలు ఉండవలసిన స్థాయిలో లేకుండా అసాధారణంగా ఉంటే లుకేమియాను సూచిస్తాయి.

2. బోన్ మ్యారో ఆస్పిరేషన్ (Bone marrow aspiration):

ఈ పరీక్ష చేయడానికి ముందుగా రక్త పరీక్ష చేస్తారు. ఒకవేళ శరీరంలో రక్త కణాల సంఖ్య అసాధారణంగా వున్నా లేదా పూర్తిగా అభివృద్ధి చెందని కణాలను కలిగివున్నా ఈ పరీక్షను నిర్వహిస్తారు. ఈ ప్రక్రియలో, ఎముక మజ్జలో వుండే ద్రవాన్ని ఒక సూదితో సేకరిస్తారు మరియు లుకేమియా ఉందో లేదో పరిశీలిస్తారు.

3. బోన్ మ్యారో బయాప్సీ (Bone marrow biopsy):

మీకు మత్తుమందు ఇచ్చి బయాప్సీ చేస్తారు. ఈ ప్రక్రియలో, ఎముక మజ్జ లేదా శోషరస కణుపుల నుండి కొద్దిగా కణజాలం నమూనాను (tissue sample) సూదిని ఉపయోగించి సేకరిస్తారు మరియు లుకేమియా ఏ రకమైనది ఎంత వేగంగా పెరుగుతుంది అనే అంశాలను అంచనా వేస్తారు.

4. స్పైనల్ ట్యాప్ (Spinal tap):

స్పైనల్ ట్యాప్ నే లంబార్ పంక్చర్ (lumbar puncture) అని కూడా పిలుస్తారు మరియు దీనిని స్థానిక మత్తుమందు (local anesthesia) ఇచ్చి నిర్వహిస్తారు. ఈ ప్రక్రియలో, ఒక చిన్న సూదిని వెన్నెముకలోకి చొప్పించి సెరెబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ (cerebrospinal fluid)ని సేకరిస్తారు.  ఈ నమూనా ద్వారా లుకేమియా సెరెబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ కి వ్యాపించిందా లేదా అని తనిఖి చేస్తారు. 

లుకేమియా రకాలు

వ్యాధి ఎంత త్వరగా పెరుగుతుంది మరియు రక్త కణాలు ఎంత త్వరగా విభజిస్తున్నాయి అనే వాటిపై ఆధారపడి లుకేమియా రెండు రకాలుగా వర్గీకరించబడింది: అక్యూట్ లుకేమియా మరియు క్రానిక్ లుకేమియా

అక్యూట్ లుకేమియా (Acute leukemia) చాలా వేగంగా పెరగగలదు మరియు ఇది పిల్లలలో ఎక్కువగా సంభవిస్తుంది. క్రానిక్ లుకేమియా (chronic leukemia) నెమ్మదిగా పెరుగుతుంది మరియు ఇది పెద్దవారిలో ఎక్కువగా సంభవిస్తుంది.

క్యాన్సర్ మొదట ఎక్కడ నుంచి సంభవించింది మరియు ప్రమేయం ఉన్న రక్త కణాల రకం ఆధారంగా, లుకేమియా నాలుగు రకాలుగా విభజించబడింది, అవి:

  1. అక్యూట్ మైలోయిడ్ లుకేమియా (Acute myeloid leukemia; AML)

ఈ క్యాన్సర్‌లో, అసాధారణ మైలోయిడ్ కణాలు (ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు లేదా ప్లేట్‌లెట్‌లుగా అభివృద్ధి చెందే ఎముక మజ్జలోని కణాలు) వేగంగా పెరుగుతాయి. ఈ కణాలు తరువాత రక్తప్రవాహంలోకి వెళ్లి శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపిస్తాయి. ఈ క్యాన్సర్‌ వృద్ధులలో సాధారణంగా సంభవిస్తుంది.

  1. క్రానిక్ మైలోయిడ్ లుకేమియా (chronic myeloid leukemia; CML)

ఈ లుకేమియా మైలోయిడ్ కణాలలో జన్యుపరమైన మార్పుల కారణంగా సంభవిస్తుంది మరియు నెమ్మదిగా పెరుగుతుంది. కాలక్రమేణా, ఇది రక్తం మరియు శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపిస్తుంది. ఈ రకమైన లుకేమియా చాలా అరుదు మరియు పిల్లలలో కంటే పెద్దలలో ఎక్కువగా సంభవిస్తుంది.

  1. అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకేమియా (Acute lymphoblastic leukemia; ALL)

ఈ రకమైన లుకేమియా సాధారణంగా ఎముక మజ్జలోని DNAలోని కొన్ని మార్పుల కారణంగా అభివృద్ధి చెందుతుంది మరియు పిల్లలలో ఎక్కువగా కనిపిస్తుంది. ఇది అభివృద్ధి చెందని తెల్ల రక్త కణాలు, B లేదా T లింఫోసైట్‌లలో ప్రారంభమవుతుంది. ఈ క్యాన్సర్ శరీరం అంతటా ఎముక మజ్జను ప్రభావితం చేయవచ్చు.

  1. క్రానిక్ లింఫోసైటిక్ లుకేమియా (Chronic lymphocytic leukemia; CLL)

ఈ రకమైన లుకేమియా ఎముక మజ్జలోని లింఫోయిడ్ రక్త కణాలలో ప్రారంభమవుతుంది మరియు తెల్ల రక్త కణాలను ప్రభావితం చేస్తుంది. ఈ అసాధారణ రక్తకణాలు శరీరంలో పేరుకుపోయి ఇన్‌ఫెక్షన్లతో పోరాడటం శరీరానికి కష్టతరం చేస్తుంది. ఇది శోషరస కణుపులు మరియు కాలేయం మరియు ప్లీహము (spleen) వంటి అవయవాలకు కూడా వ్యాపిస్తుంది. CLL అనేది పిల్లలలో చాలా అరుదు మరియు ఎక్కువగా వృద్ధులను ప్రభావితం చేస్తుంది. 

లుకేమియా యొక్క దశలు

లుకేమియా యొక్క దశలను (stages) గుర్తించడం ద్వారా క్యాన్సర్ ఎంతవరకు వ్యాపించిందో తెలుసుకోవడానికి సహాయపడుతుంది. క్యాన్సర్ దశను పరిగణించి, వైద్యులు అత్యంత సరైన చికిత్సలను నిర్ణయిస్తారు.

Rai స్టేజింగ్ సిస్టమ్‌ని ఉపయోగించి క్రానిక్ లుకేమియా యొక్క దశను కనుగొనవచ్చు. ఈ స్టేజింగ్ సిస్టమ్‌లో రక్తంలోని లింఫోసైట్‌ల సంఖ్య, రక్తహీనత మరియు శోషరస కణుపులు, ప్లీహము లేదా కాలేయం యొక్క పరిమాణంలో పెరుగుదల వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని లుకేమియా యొక్క దశను నిర్ణయిస్తారు.

ఫ్రెంచ్-అమెరికన్-బ్రిటీష్ (French-American-British; FAB) సిస్టమ్‌ని ఉపయోగించి అక్యూట్ లుకేమియా  యొక్క దశను కనుగొంటారు. ఈ స్టేజింగ్ సిస్టమ్ లో ఆరోగ్యకరమైన రక్త కణాల సంఖ్య, లుకేమియా కణాల సంఖ్య మరియు పరిమాణం, లుకేమియా కణాల క్రోమోజోమ్ మార్పులు మరియు ఇతర జన్యుపరమైన మార్పులను పరిగణనలోకి తీసుకొని అక్యూట్ లుకేమియా యొక్క దశను నిర్ణయిస్తారు.

లుకేమియా చికిత్స (Treatment for Leukemia)

లుకేమియా రకం, రోగి యొక్క వయస్సు మరియు ఆరోగ్యం, మరియు ఇతర అవయవాలు లేదా కణజాలాలకు లుకేమియా వ్యాప్తి యొక్క పరిధిపై ఆధారపడి సరైన చికిత్సా పద్ధతిని ఎంచుకుంటారు. మీకు ఉత్తమమైన చికిత్స ఎంపికలు, వాటి ప్రయోజనాలు, సమస్యలు మరియు దుష్ప్రభావాల గురించి మీ వైద్యుడు మీతో చర్చించి నిర్ణయం తీసుకుంటారు.

లుకేమియా చికిత్సకు అందుబాటులో ఉన్న చికిత్స విధానాలు:

కీమోథెరపీ:

కీమోథెరపీలో శక్తివంతమైన యాంటీ-క్యాన్సర్ (anti-cancer) మందులు చాలా నెలల పాటు క్రమానుగతంగా (periodically) ఇవ్వబడతాయి. దాదాపు అన్ని రకాల లుకేమియాకు ఇది ప్రధాన చికిత్స. లుకేమియాను నయం చేయడానికి మరియు నియంత్రించడానికి లేదా క్యాన్సర్ లక్షణాల నుండి ఉపశమనాన్ని అందించడానికి కీమోథెరపీ ఇవ్వబడుతుంది. 

కీమోథెరపీ మందులు నోటి ద్వారా తీసుకోవడానికి మాత్రలుగా లేదా ఇంట్రావీనస్ (నేరుగా సిరలోకి)గా స్వీకరించడానికి ఇన్ఫ్యూషన్‌ రూపంలో అందుబాటులో ఉన్నాయి. చికిత్స కొన్ని సైకిల్స్ వలె ప్రణాళిక చేయబడుతుంది. అనగా మొదటి మోతాదు తర్వాత, చికిత్స నుండి కోలుకోవడానికి మీకు కొన్ని రోజులు విశ్రాంతి ఇవ్వబడుతుంది, ఆ తరువాతనే రెండవ మోతాదు ఇవ్వబడుతుంది. చికిత్స యొక్క వ్యవధి ఆరు నెలల నుండి ఎక్కువ కాలం వరకు ఉండవచ్చు.

కీమోథెరపీ చికిత్స 3 దశలుగా విభజించబడింది:

ఇండక్షన్ దశ (Induction phase): ఇది తక్కువ సమయంలో ఇచ్చే చికిత్స దశ, దాదాపు ఒక నెల పాటు ఉంటుంది. ఈ దశలో ఇచ్చే మందులు రక్తం మరియు ఎముక మజ్జలోని క్యాన్సర్ కణాలను నాశనం చేస్తాయి.

కన్సాలిడేషన్ దశ (Consolidation phase): ఈ దశ కొన్ని నెలల పాటు కొనసాగుతుంది. ఈ దశలో ఇచ్చే మందులు ఇండక్షన్ దశ తర్వాత మిగిలి ఉన్న క్యాన్సర్ కణాలను నాశనం చేస్తాయి.

నిర్వహణ దశ (Maintenance phase):  దీనినే పోస్ట్-కన్సాలిడేషన్ దశ అని కూడా అంటారు. ఇది దాదాపు 2 సంవత్సరాల పాటు కొనసాగే చివరి దశ. క్యాన్సర్ మళ్లీ రాకుండా నిరోధించడానికి తక్కువ మోతాదులో కీమోథెరపీ మందులు ఇస్తారు.

సాధారణంగా, కీమోథెరపీ మందులు రక్త క్యాన్సర్‌ను సమర్థవంతంగా చికిత్స చేయడానికి రెండు లేదా అంతకంటే ఎక్కువ మందులను కలపడం ద్వారా ఇవ్వబడతాయి.

ఉదాహరణకు;

  • ఆంత్రాసైక్లిన్ (anthracycline), డోక్సోరూబిసిన్ (doxorubicin ) లేదా ఇడారూబిసిన్ (idarubicin ) మరియు సైటరాబైన్ (cytarabine) మందులను కలిపి ఇవ్వడం
  • అజాసిటిడిన్ (azacitidine) లేదా డెసిటాబైన్ (decitabine) లేదా తక్కువ-మోతాదు సైటరాబైన్ (low-dose cytarabine) మొదలైన వాటితో కలిపి వెనెటోక్లాక్స్ (venetoclax) ఇవ్వడం

కీమోథెరపీ యొక్క దుష్ప్రభావాలు

కీమోథెరపీ మందుల మోతాదు మరియు చికిత్స యొక్క తీవ్రతను బట్టి దుష్ప్రభావాలను కలిగిస్తుంది. ప్రతి రోగికి దుష్ప్రభావాలు భిన్నంగా ఉంటాయి. కీమోథెరపీ యొక్క కొన్ని సాధారణ దుష్ప్రభావాలు:

  • వికారం మరియు వాంతులు
  • ఆకలి లేకపోవడం
  • జుట్టు రాలడం
  • నోటి పుండ్లు
  • విరేచనాలు లేదా మలబద్ధకం
  • అలసట

టార్గెటెడ్ థెరపీ

క్యాన్సర్ కణాలు పెరగడానికి, విభజించడానికి మరియు వ్యాప్తి చెందడానికి సహకరించే ప్రోటీన్‌లను టార్గెటెడ్ థెరపీ నాశనం చేయడం ద్వారా లుకేమియాకు చికిత్స చేస్తుంది. ఈ చికిత్స ఆరోగ్యకరమైన కణాలకు ఎక్కువ హాని కలిగించకుండా నిర్దిష్ట క్యాన్సర్ కణాలను గుర్తించి దాడి చేస్తుంది. టార్గెటెడ్ థెరపీ ఉదాహరణలు:

  • మోనోక్లోనల్ యాంటీబాడీస్ (Monoclonal antibodies)

ఉదాహరణలు: 

  • ఇనోటుజుమాబ్ (Inotuzumab)
  • జెమ్టుజుమాబ్ (gemtuzumab)
  • రిటక్సిమాబ్ (rituximab)
  • ఓఫాటుముమాబ్ (ofatumumab)
  • ఒబినుటుజుమాబ్ (obinutuzumab) 
  • అలెంటుజుమాబ్ (Alentuzumab)

 

  • టైరోసిన్ కైనేస్ ఇన్హిబిటర్స్ (Tyrosine kinase inhibitors)

ఉదాహరణలు: 

  • దసాటినిబ్ (dasatinib)
  • నీలోటినిబ్ (nilotinib)
  • పోనాటినిబ్ (ponatinib)
  • రుక్సోలిటినిబ్ (ruxolitinib)
  • ఫెడ్రాటినిబ్ (fedratinib)
  • గిల్టెరిటినిబ్ (gilteritinib)
  • మిడోస్టారిన్ (midostarine)
  • ఐవోసిటినిబ్ (ivocitinib)
  • ఇబ్రూటినిబ్(ibrutinib)
  • వెనెటోక్లాక్స్ (venetoclax)

టార్గెటెడ్ థెరపీ యొక్క దుష్ప్రభావాలు:

  • చర్మ అలెర్జీలు మరియు మొటిమలు
  • రక్తము గడ్డ కట్టుట
  • గాయాలు ఆలస్యంగా నయం కావడం 
  • వికారం మరియు వాంతులు
  • రక్తపోటు ఎక్కువ లేదా తక్కువ అవ్వడం 

స్టెమ్-సెల్ మార్పిడి

ఈ చికిత్సలో, క్యాన్సర్-బాధిత ఎముక మజ్జను తొలగించి కొత్త ఆరోగ్యకరమైన ఎముక మజ్జతో భర్తీ చేస్తారు. ఈ మార్పిడి రెండు విధాలుగా చేయవచ్చు. 

  • రోగి యొక్క ఆరోగ్యకరమైన మూలకణాలను (రక్త కణాలను ఉత్పత్తి చేసే కణాలు) చికిత్సకు ముందు రక్తం లేదా ఎముక మజ్జ నుండి సేకరించి నిల్వ చేస్తారు మరియు చికిత్స తర్వాత రోగికి తిరిగి ఇంజెక్ట్ చేస్తారు. ఈ ప్రక్రియను ఆటోలోగస్ స్టెమ్ సెల్ ట్రాన్స్‌ప్లాంట్ (autologous stem cell transplant) అంటారు. ఈ చికిత్సలో, రేడియోథెరపీ లేదా కీమోథెరపీ ద్వారా నాశనమైన రోగి యొక్క మూలకణాలను ఆరోగ్యకరమైన మూలకణాలతో భర్తీ చేస్తారు.
  • రెండవ పద్ధతి, ఆరోగ్యకరమైన మూలకణాలను దాత (donor) నుండి తీసుకొని రోగికి (recipient) అందించడం. ఈ ప్రక్రియను అలోజెనిక్ స్టెమ్ సెల్ ట్రాన్స్‌ప్లాంట్ (allogeneic stem cell transplant) అంటారు. ఈ ఆరోగ్యకరమైన హెమటోపోయిటిక్ మూలకణాలు తరువాత మీ శరీరానికి అవసరమైన కొత్త రక్త కణాలను తయారు చేస్తాయి. 

స్టెమ్-సెల్ మార్పిడి యొక్క దుష్ప్రభావాలు:

  • నోరు మరియు గొంతు నొప్పి
  • రక్తస్రావం
  • వికారం మరియు వాంతులు
  • గ్రాఫ్ట్-వర్సెస్-హోస్ట్ వ్యాధి (Graft-versus-host disease; ఇది దాత యొక్క ఎముక మజ్జ లేదా మూలకణాలు స్వీకరించిన రోగికి అనుకూలించనప్పుడు సంభవించే పరిస్థితి. ఇది అలోజెనిక్ మార్పిడి తర్వాత ఎప్పుడైనా సంభవిస్తుంది)
  • ఇంటర్‌స్టీషియల్ న్యుమోనైటిస్ (Interstitial pneumonitis)
  • ఇతర ఊపిరితిత్తుల సమస్యలు
  • ఇన్ఫెక్షన్లు

మీకు సమీపంలోని మా Onco క్యాన్సర్ సెంటర్స్ వైద్యులతో అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవడానికి. ఇక్కడ క్లిక్ చేయండి

మీకు క్యాన్సర్ చికిత్సలకు సంబంధించి ఏదైనా సహాయం కావాలంటే, 79965 79965 కు కాల్ చేసి మమ్మల్ని సంప్రదించవచ్చు.

Team Onco

Helping patients, caregivers and their families fight cancer, any day, everyday.

Recent Posts

  • తెలుగు

కీమోథెరపీకి ఎలాంటి దుస్తులు ధరించాలి?

కీమోథెరపీ కోసం క్యాన్సర్ రోగులు ఎలాంటి దుస్తులు ధరించాలో తెలుసా? ఈ ఆర్టికల్‌లో, క్యాన్సర్ రోగులకు కీమోథెరపీని సౌకర్యవంతంగా పొందడంలో సహాయపడే దుస్తుల జాబితాను అందించాము.

2 years ago
  • తెలుగు

మీ కోసం సరైన ఆంకాలజిస్ట్‌ని ఎలా కనుగొనాలి?

ఈ కథనం మీ క్యాన్సర్ రకానికి సరైన క్యాన్సర్ వైద్యుడిని కనుగొనడానికి 6-దశల గైడ్‌ను వివరిస్తుంది.

2 years ago
  • हिन्दी

वो 6 आदतें जो हैं कैंसर को बुलावा (habits that increase cancer risk)

तंबाकू का सेवन गुटका, जर्दा, पैन मसाला आदि के रूप में करना सिर और गले के कैंसर का मुख्य कारण…

2 years ago
  • తెలుగు

నోటి పుండ్లతో బాధపడుతున్న క్యాన్సర్ రోగులకు సరైన ఆహారాలు

నోటి పుండ్లతో బాధపడుతున్న క్యాన్సర్ రోగులకు క్యాన్సర్ చికిత్సలో ఉన్నప్పుడు తీసుకోవాల్సిన 12 ఉత్తమ ఆహారాలు.

2 years ago
  • తెలుగు

మీకు క్యాన్సర్ వచ్చే అవకాశాలను పెంచే 6 రోజువారీ అలవాట్లు

క్యాన్సర్‌కు కారణమయ్యే 6 జీవనశైలి కారకాలు గురించి ఈ కథనంలో వివరంగా ఇవ్వబడ్డాయి. అవి ఏమిటో తెలుసుకోండి!

2 years ago
  • हिन्दी

घर में इन गलतियों से आप दे रहें कैंसर को न्योता!

शोध की मानें तो न्यूज़पेपर प्रिंट करने में जो स्याही का इस्तेमाल होता है उसमें ऐसे केमिकल होते हैं जो…

2 years ago